సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
సూర్య ఏపీ డెస్క్: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, చినమేరంగి సంస్థానాధీశుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో విశాఖపట్నంలోని అపోలో (ఓ ప్రైవేటు) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 'ఉత్తరాంధ్ర టైగర్'గా అభిమానులు పిలుచుకునే శత్రుచర్ల మరణంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
1948 ఆగస్టు 4న పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగిలో జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు, నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1978లో జనతా పార్టీ తరఫున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983, 1985లలో నాగూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989, 1991లలో కాంగ్రెస్ తరఫున, 1998లో తెలుగుదేశం పార్టీ తరఫున పార్వతీపురం లోక్‌సభ ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో గళం వినిపించారు.
అనంతరం 1999లో నాగూరు నుంచి, 2004లో పార్వతీపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ, సాంకేతిక శాఖ మంత్రిగా, రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 2017లో శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి సభ్యునిగా సేవలందించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.