ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన చేయాలి: సీఐటీయూ డిమాండ్
గాజువాక, మేజర్ న్యూస్ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించాలని స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్, అధ్యక్షుడు యు.రామస్వామి డిమాండ్ చేశారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి సంఘీభావంగా మంగళవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ.. దేశంలో వందేళ్లకు సరిపడా ఇనుప ఖనిజం గనులు ఉన్నా విశాఖ ఉక్కుకు కేటాయించకుండా, కనీసం 'సెయిల్'లో విలీనం చేయకుండా విక్రయించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రూ.54 వేల కోట్లు పన్నులు చెల్లించిన కర్మాగారానికి కోక్ ఒవెన్ బ్యాటరీ-6, సింటర్ ప్లాంట్ మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రామస్వామి మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని, రూ.900 కోట్ల వేతన బకాయిలు, హెచ్ఆర్ఏ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పని భద్రత కొరవడి గతేడాది 26 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీపీఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిందని, ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు టి.వి.కె.రాజు, పుల్లారావు, బి.మహేష్, డి.ఎస్.వి.ఎస్.శ్రీనివాస్, వి.ప్రసాద్, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు