ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి
-- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి:
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఏఎస్‌డీడీ (గైర్హాజరు, శాశ్వతంగా బదిలీ అయిన, మరణించిన, ఇప్పటికే నమోదైన) ఓటర్ల వివరాలను అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ నెల 18న జారీ చేసిన మెమో ప్రకారం సవరించిన షెడ్యూల్‌ను వివరించిన కలెక్టర్, జిల్లాలో మొత్తం 1,72,509 మంది ఏఎస్‌డీడీ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 78,482 మంది గైర్హాజరు ఓటర్లు, 44,956 మంది శాశ్వతంగా బదిలీ అయిన వారు, 32,556 మంది ఇప్పటికే నమోదైన వారు, 16,444 మంది మరణించిన వారు అలాగే 71 మంది ఇతరులు ఉన్నట్లు గణాంకాల ద్వారా వెల్లడించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ - 2026 పంపిణీ, ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల దశలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరిష్కరించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అస్పష్టమైన ఓటర్లకు తమ వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం కల్పించి, రికార్డులను సక్రమంగా నమోదు చేస్తూ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారాన్ని డిసెంబర్ 15, 2026 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బూత్ స్థాయి ఏజెంట్లు తమ పరిధిలోని జాబితాలను పరిశీలించి, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే బూత్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి సేకరణలో అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఏఎస్‌డీడీ ఓటర్ల జాబితాపై వాస్తవాధారిత సూచనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం సమర్పించి, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొనాలని రాజకీయ పార్టీలకు కలెక్టర్ సూచించారు. సవరించిన షెడ్యూల్‌ను పార్టీల ప్రతినిధులకు లిఖితపూర్వకంగా అందజేసి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.ఎం.జె. బాబు (తెలుగుదేశం పార్టీ), పి. తేజేశ్వరరావు (సీపీఐఎం), పి. రవి కుమార్ (ఆమ్ ఆద్మీ పార్టీ), కె.వి.ఎల్.ఎస్. ఈశ్వరి (కాంగ్రెస్), బి. అర్జున్ కుమార్ (జనసేన), రౌతు శంకరరావు (వైఎస్ఆర్సీపీ) తదితరులు పాల్గొన్నారు.