పన్ను సమస్యల పరిష్కారానికి ‘రెవెన్యూ మేళా’
గాజువాక జోనల్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం
గాజువాక, మేజర్ న్యూస్ : ప్రజలకు ఆస్తి పన్ను సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో జోనల్ కమిషనర్ శేషాద్రి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో ప్రత్యేక ‘రెవెన్యూ మేళా’ నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా టైటిల్ ట్రాన్స్‌ఫర్, ఇంటి యాజమాన్య మార్పులు, పన్ను వివరాల సవరణలు, కొత్త అసెస్‌మెంట్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆస్తి పన్ను, యాజమాన్య బదిలీ తదితర అంశాలపై పెండింగ్ సమస్యలు ఉన్నవారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రామనారాయణ, ఆర్‌ఐలు ఫణీంద్ర, రెడ్డి మోహన్ తదితరులు పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు