ఘనంగా ద్వాదశ జ్యోతిర్లింగ వైభవ కార్యక్రమం
నరసన్నపేట నవంబర్ 24 మేజర్ న్యూస్ : స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టత, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పే ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలను ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ.. ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలసిన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల విశిష్టత, పౌరాణిక ప్రాధాన్యతను విద్యార్థులు లక్షిత్, వంశీకృష్ణ, నవనీత్ సత్యసాయి, కౌశిక్ చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. భారతదేశ పటంలో ద్వాదశ జ్యోతిర్లింగాల స్థానాలను గుర్తించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం రమణమూర్తి శివతత్వం, ఆధ్యాత్మిక విలువలు, సనాతన ధర్మం గొప్పతనాన్ని వివిధ అంశాల ద్వారా వివరించారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతనతో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సత్యం రాజు మాస్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.