తొలి సమరం నేడే
విజయనగరం బ్యూరో, మేజర్ న్యూస్
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరగనుంది. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. రూట్ల వారిగా వీరికి ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తి అయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
బరిలో 429 మంది సర్పంచ్ అభ్యర్థులు
ఈ విడతలో బొబ్బిలి, విజయనగరం రెవెన్యూ డివిజన్లలోని మొత్తం 8 మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఎన్నికలకు నోటిఫై అయిన 773 పంచాయతీల్లో 221 (28.6 శాతం) ఈ దశలోనే ఉన్నాయి. వీటిలో 2,108 వార్డులు, 2,148 పోలింగ్ కేంద్రాలు, 3,81,351 మంది ఓటర్లు ఉన్నారు. 36 ఏకగ్రీవాలు పోగా 185 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 429 మంది పోటీ పడుతున్నారు. 1,453 వార్డులకు 3,013 మంది అభ్యర్థులు తలపడనున్నారు. 654 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తవలస మండలం సంతపాలెం పంచాయతీలోని 10వ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదు. రెండు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, వార్డు సభ్యుల స్థానాలకు, 9 పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 1,813 కేంద్రాలు ఏర్పాటయ్యాయి, 3,29,434 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కొత్తవలస, శృంగవరపుకోటల్లో 20 చొప్పున అదనపు కేంద్రాలు సిద్ధం చేశారు.
బొబ్బిలి నియోజకవర్గంలో 97 పంచాయతీలు (932 కేంద్రాలు), ఎస్.కోట నియోజకవర్గంలో 88 పంచాయతీలు (881 కేంద్రాలు) ఉన్నాయి.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
185 పంచాయతీల్లో 96 సాధారణమైనవి కాగా, 60 సున్నితమైనవి, 29 అతి సున్నితమైనవి. కేంద్రాల పరంగా 847 సాధారణ, 588 సున్నిత, 378 అతి సున్నిత విభాగాల్లో ఉన్నాయి. వీటిలో రామభద్రపురం, తెర్లాం, ఎల్.కోట, శృంగవరపుకోట మండలాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.
సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లోని 89 పంచాయతీల పరిధిలో 966 పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
పోలింగ్ కేంద్రాలు ఉన్న 1,023 గదుల్లో 469 చోట్ల (290 సున్నిత, 179 అతి సున్నిత) వెబ్‌కాస్టింగ్ ఉంటుంది.
మిగిలిన 554 సాధారణ గదుల్లో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు.
సిబ్బంది, రవాణా సదుపాయాలు
పోలింగ్ నిర్వహణకు 5,983 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో 2,325 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు ఉన్నారు (రిజర్వు సహా). పర్యవేక్షణ కోసం 32 జోన్లు, 72 రూట్లు ఏర్పాటయ్యాయి.
సిబ్బంది, సామగ్రి తరలింపునకు 95 బస్సులు, 110 టాటా ఏస్/జీపు/మ్యాక్సీ క్యాబ్‌లు వినియోగిస్తున్నారు. జోనల్ అధికారుల కోసం 32 వాహనాలు, ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల కోసం 16 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 3,073 బ్యాలెట్ పెట్టెలు పనిచేసే స్థితిలో ఉండగా, తొలి విడతకు అవసరమైనవి అందులోనే సమకూరాయి.
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
మొత్తం 221 పంచాయతీల్లో 213 చోట్ల 12 లోపు పోలింగ్ కేంద్రాలే ఉన్నందున లెక్కింపు సాఫీగా సాగనుంది. 13–18 కేంద్రాలున్న పంచాయతీలు ఆరు కాగా, 37–40 కేంద్రాలున్నవి కొత్తవలస, శృంగవరపుకోటల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. అందుకే ఈ రెండు మండలాల్లో ఐదుగురు చొప్పున, మొత్తం 16 మంది అదనపు సిబ్బందిని (డిప్యూటీ ఎంపీడీఓ/డీటీ) నియమించారు.