andhrapradesh
తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా వాతావరణ పరిస్థితులు, తుఫాన్ గమనంపై విపత్తుల నిర్వహణ శాఖ మరియు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి పూర్తి వివరాలను నివేదించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
అధికారుల నివేదిక అనంతరం స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల సంభవించిన తుఫాన్ నష్టాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం (IMCT) చేసిన కీలక సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచడం వంటి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.