andhrapradesh
ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు
విశాఖపట్నం: వరుస తుఫాన్ల ధాటికి ఇప్పటికే అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు మరో పెనుముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ మరియు నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ (సోమవారం) సాయంత్రానికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రేపటికి (మంగళవారం) ఇది తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెంది, ఆ తర్వాత వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం, ఈ తుఫాన్ ఈ నెల 19వ తేదీన మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరోవైపు, ఈ తుఫాన్ గమనాన్ని మరియు వాతావరణ మార్పులను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్ చేసేందుకు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం (CWC) అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.