తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు!
అంబేద్కర్ కోనసీమ జిల్లా: అర్నాబ్ తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన ఓ వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
గ్రామానికి చెందిన అడబాల సూర్యనారాయణ, సూర్యవతి దంపతులు నివసిస్తున్న ఇంటిపై తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తోడు గాలులు తీవ్రంగా వీయడంతో వారి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.
ఇక ఇంటి గోడలు మట్టితో నిర్మించినవి కావడంతో నిరంతర వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. దీంతో గోడలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో వృద్ధ దంపతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇంట్లో ఉండటమే ప్రమాదకరంగా మారడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తుఫాను పరిస్థితుల్లో బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వృద్ధ దంపతులకు తక్షణ సాయం అవసరమని స్థానికులు చెబుతున్నారు. వారి పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు తగిన స్పందన కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసినప్పటికీ సహాయం అందలేదని స్థానికులు తెలిపారు.
అధికారుల తక్షణ స్పందనకు విజ్ఞప్తి
వృద్ధ దంపతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఇంటి నుంచి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన ఇతర సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, ప్రమాదకర ఇళ్లలో నివసిస్తున్న వృద్ధులు, పిల్లలు, మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
సూర్య వెబ్ డెస్క్