తాపేశ్వరం అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మండపేట మండలం తాపేశ్వరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 9, 10 తేదీల్లో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ‘పోషణ్ భీ – పఢాయ్ భీ’ రెండో విడతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీడీపీఓ పూర్ణిమ ఆదేశాల మేరకు సూపర్‌వైజర్లు సునీత, కుమారి ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని మొత్తం 92 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకు పోషకాహారం అందించడం, వారి ఎదుగుదలను పర్యవేక్షించడం, ఆకలి పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. పిల్లల బరువు, ఎత్తు కొలవడం, వివరాలను పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేయడంపై శిక్షణ ఇచ్చారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలతో పాటు ఎస్‌ఏఎం, ఎంఏఎం సమస్యలున్న చిన్నారులను గుర్తించే విధానాలను వివరించారు. అవసరమైన పిల్లలను పోషక పునరావాస కేంద్రాలకు పంపించడం, దివ్యాంగ పిల్లలకు విద్య ఎలా అందించాలో సూచనలు చేశారు. గృహ సందర్శనల సమయంలో తల్లులకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాకాడ రమణ పాల్గొన్నారు.,