శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత..
తిరుమల:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు దాదాపు 121 కిలోల బరువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి కానుకగా అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఈ విలువైన ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందజేశారు.
శ్రీవారి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించేందుకు వీలుగా ఏకంగా 46 రకాల బంగారు ఆభరణాలను భక్తుడు తయారు చేయించి సమర్పించారు. స్వామివారి నిత్య, విశేష అలంకరణలలో వినియోగించే అన్ని రకాల ఆభరణాలు ఇందులో ఉండటం విశేషం. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా అందించిన భక్తుడు వర్ధమాన్ జైన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం టీటీడీ అర్చకులు, అధికారులు దాతకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.