కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : నగర పారిశుద్ధ్య నిర్వహణలో కీలకమైన మస్టర్ పాయింట్‌ను మేయర్ రమేష్ గౌడ్ పరిశీలించారు. అక్కడ విధులకు హాజరైన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో ఆయన ఆప్యాయంగా ముచ్చటించి వారిలో ఉత్సాహం నింపారు. విధులను చిరునవ్వుతో, ఆనందంగా నిర్వర్తిస్తూ నగర పరిశుభ్రతకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మస్టర్ పాయింట్‌లో కార్మికుల వాహనాలను క్రమపద్ధతిలో నంబర్లతో గుర్తించేలా ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు. వాహనాల వెనుక భాగాలతో పాటు వాటి పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన విధానాలు పాటించినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు.
కార్మికులతో మాట్లాడుతూ.. పని ఒత్తిడిని పక్కనపెట్టి ఉల్లాసంగా విధులు నిర్వహించాలని, మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడే సేవల్లో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. విధులను కేవలం ఉద్యోగ బాధ్యతగా కాకుండా నగర ప్రజలకు అందించే సేవగా భావించాలని సూచించారు. ప్రజలు చెల్లించే పన్నులకు తగిన ప్రతిఫలంగా నగరపాలక సంస్థ నుంచి అవసరమైన సేవలను సకాలంలో, సమర్థవంతంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగి, కార్మికుడిపై ఉందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అందరూ పనిచేయాలని కోరారు.
అందరి సమన్వయంతో అనంత సుందరీకరణ
డిప్యూటీ మేయర్ స్వాతి, నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగుల సమష్టి సహకారంతో నగర అభివృద్ధి, సుందరీకరణకు పునాదులు వేద్దామని మేయర్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే పరిశుభ్రమైన, సుందరమైన అనంతపురాన్ని నిర్మించగలమని అన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్మికులతో ఎంహెచ్‌ఓ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ముచ్చట్లు
మేయర్ పర్యటన సందర్భంగా ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులు తదితరులు కూడా మస్టర్ పాయింట్‌లో కార్మికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ, విధుల క్రమబద్ధీకరణ, నగర పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై సిబ్బందితో చర్చించారు. కార్మికులకు అవసరమైన సూచనలు చేస్తూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.