స్కూటీని ఢీకొన్న కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి పాల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
పాములపాడు, మేజర్ న్యూస్: పాములపాడు మండలంలోని పాల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఎర్రగుడూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఎర్రగుడూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. AP 21 BF 6515 నంబరు గల స్కూటీ పాములపాడు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తుండగా, ఆత్మకూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న AP 39 SD 6264 నంబరు గల కారు పాల కేంద్రం సమీపంలో స్కూటీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న 1033 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఊహించని ఈ ప్రమాదంతో ఎర్రగుడూరు గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.