గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. డిసెంబర్ 4న నాగచైతన్య మిస్టీరియస్ అడ్వెంచర్ రిలీజ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, దర్శకుడు కార్తీక్ వర్మ దండు రూపొందించిన ప్రతిష్ఠాత్మక మిస్టీరియస్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ అఫీషియల్ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్వీసీసీ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, స్పర్శ్ శ్రీవాత్సవ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే నెల్లూరులో నిర్వహించిన ప్రత్యేక వేదికపై చిత్రబృందం ట్రైలర్‌ను ప్రదర్శించగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్‌లో విడుదల కొద్దిసేపు ఆలస్యమైంది. తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా వేదిక ద్వారా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఐదు వేల ఏళ్ల నాటి అతీంద్రియ శక్తి, పురాతన సంకేతాలు, మానవాళికి పొంచి ఉన్న ముప్పు చుట్టూ కథ సాగేలా ట్రైలర్‌ను ఉత్కంఠభరితంగా కట్ చేశారు. ఒక నిధి అన్వేషకుడి ప్రయాణంగా మొదలయ్యే కథ, సృష్టి ధర్మాన్ని కాపాడే దైవ సంకల్పంగా మారే తీరు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగానూ వృషకర్మ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగల తీర్చిదిద్దిన గుహల సెట్స్, రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ, అజనీశ్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం సినిమాలోని మిస్టరీ, థ్రిల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్రబృందం డిసెంబర్ 4న వృషకర్మ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మైథాలజీ, మిస్టరీ, సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.