స్వీయ దర్శకత్వంలో అర్జున్ సర్జా భారీ దేశభక్తి చిత్రం.. అయోధ్యలో రేపు పూజా కార్యక్రమాలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా దేశభక్తి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం వంటి అంశాల నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 27న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక సందర్భంగా చిత్రబృందం సినిమా అధికారిక టైటిల్‌ను కూడా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.
రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మాత అనూప్ మోహన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతదేశ గొప్పతనం, భావోద్వేగాలు, భారీ యాక్షన్ హంగులతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారు. అయోధ్యలో జరిగే ముహూర్త వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. యాక్షన్ హీరోగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న అర్జున్ సర్జా ఈసారి దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.