national
కేరళ బంపర్ లాటరీ: రూ.25 కోట్ల భారీ జాక్‌పాట్.. ప్రారంభించిన సీఎం వి.డి. సతీశన్
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర లాటరీల విభాగం మరోసారి భారీ బహుమతులతో కూడిన క్రిస్మస్-న్యూ ఇయర్ బంపర్ లాటరీ (2026-27)ని ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ గురువారం ఈ బంపర్ లాటరీ టికెట్లను అధికారికంగా ప్రారంభించారు. గత ఏడాది రూ.20 కోట్లుగా ఉన్న మొదటి బహుమతిని ఈసారి ఏకంగా రూ.25 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ లాటరీలో మొదటి బహుమతి విజేతకు రూ.25 కోట్లు లభించనుండగా, రెండో బహుమతి కింద 24 మందికి రూ.కోటి చొప్పున, మూడో బహుమతి కింద మరో 24 మందికి రూ.10 లక్షల చొప్పున అందించనున్నారు. వీటితో పాటు నాలుగో బహుమతిగా 24 మందికి రూ.5 లక్షల చొప్పున, ఐదో బహుమతిగా 108 మందికి రూ.లక్ష చొప్పున, కన్సోలేషన్ బహుమతి కింద 11 మందికి రూ.లక్ష చొప్పున కేటాయించారు. ఇవి కాకుండా రూ.500 నుంచి రూ.5,000 వరకు వేల సంఖ్యలో ఇతర నగదు బహుమతులతో కలిపి మొత్తం 7,66,992 బహుమతులను కేరళ లాటరీ విభాగం ప్రకటించింది.
ఈ బంపర్ లాటరీ టికెట్ ధరను రూ.450గా నిర్ణయించారు. నవంబర్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలలో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ లాటరీకి సంబంధించిన లక్కీ డ్రాను 2027, ఫిబ్రవరి 1వ తేదీన తిరువనంతపురంలో నిర్వహించనున్నారు.