ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం
రాజమహేంద్రవరం, నవంబరు 26, 2026:
ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day / Samvidhan Diwas) ను కళాశాల ప్రిన్సిపాల్ డా. M.S. రాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. .
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. M.S. రాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగాలలో ఒకటని, దేశంలోని ప్రతి పౌరునికి కుల, మత, ప్రాంత, వర్గ, లింగ వివక్షతలకు తావులేకుండా స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించే గొప్ప లక్ష్యంతో రూపొందించబడిందని పేర్కొన్నారు. రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించడంతో పాటు, దేశం పట్ల ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన ప్రాథమిక విధులను కూడా నిర్దేశించిందన్నారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎంతో శ్రమించి, మేధోమథనం చేసి రూపొందించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే నిజమైన దేశసేవ అని తెలిపారు. తోటి వారికి సహాయపడటం, చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించడం ద్వారా దేశ ప్రగతికి ప్రతి పౌరుడు తన వంతు సహకారం అందించాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, వారు దేశం పట్ల గౌరవం, తమ విధుల పట్ల నిబద్ధత, దేశభక్తి కలిగి ఉండాలని, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా మంచి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
డా. B. శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ అభ్యున్నతి ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండటంతో పాటు, తమ తమ విద్యుక్త ధర్మాలను నిబద్ధతతో నిర్వర్తించినప్పుడే నిజమైన దేశభక్తిని చాటుకున్నవారమవుతామని తెలిపారు.
డా. రమేష్ బాబు, హెచ్.ఓ.డి., ఫోరెన్సిక్ మెడిసిన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుని స్వేచ్ఛ, సమానత్వం, గౌరవాన్ని పరిరక్షించే గొప్ప ప్రజాస్వామ్య పత్రం అని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, తమ హక్కులతో పాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని హితవు పలికారు.
శ్రీ టి.పి. శాస్త్రి, సామాజిక శాస్త్రోపన్యాసకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరికీ భారతీయులుగా మనం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ మరియు రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సేవలను స్మరించుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఉన్నత విలువలకు ప్రాధాన్యతనిచ్చిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగ పీఠికలోని ఆశయాలు, పౌరుల ప్రాథమిక హక్కులు, విధుల గురించి అవగాహన కల్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠిక (Preamble) విశిష్టతను వివరిస్తూ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులతో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి , రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ సమగ్రత, ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జై హింద్! జై భారత్!