శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం
అయినవిల్లి,మేజర్ న్యూస్ : శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి ఆలయ ఛైర్మన్ గారి అద్యక్షతన, కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం జరిగినది. చర్చించి ఆమోదించిన అంశములు
వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా వివిధ విభాగాలకు చేసిన చెల్లింపులు, కొనుగోళ్లు, సేవలు, పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్, అలంకరణలు, అన్నప్రసాదం మరియు ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులను విభాగాల వారీగా పరిశీలించి ఆమోదించడమైనది.
అన్నప్రసాదం మరియు ప్రసాదం తయారీ ప్రక్రియలో ఇటీవల తలెత్తిన సమస్యలు, వాటి కారణాలు, భవిష్యత్తులో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా దేవస్థానం తరఫున సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు మరియు నాణ్యతా ప్రమాణాలపై సమగ్రంగా చర్చించుట జరిగినది. కిరాణా సరుకులు మరియు కూరగాయలను దేవస్థానానికి దిగుమతి చేసుకునే సమయంలో ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలోనే స్వీకరించి దించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. తులాభారం ద్వారా వచ్చిన ప్రతి సరుకును దేవస్థానం అధికారికంగా స్వీకరించి, సంబంధిత స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేసి, అవసరాన్ని బట్టి అన్నప్రసాదం మరియు ఇతర దేవస్థాన అవసరాలకు వినియోగించే విధానంపై చర్చించుట జరిగినది.
ఈ విషయమై వంతుదారులైన అర్చక స్వాములకు తమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల వ్యవధిలోగా లిఖితపూర్వకంగా తెలియజేయవలసిందిగా కోరుతూ, తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక హోమానికి ప్రస్తుతం అమలులో ఉన్న రుసుమును పెంచే ప్రతిపాదనపై చర్చించుట జరిగినది. ప్రస్తుత రుసుము, హోమానికి అయ్యే వాస్తవ వ్యయం, వినియోగించే పూజా ద్రవ్యాలు, అర్చకులు/సిబ్బంది సేవలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని, ప్రత్యేక హోమం రుసుమును రూ.5,000/-గా నిర్ణయించుటకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.
భక్తులకు దేవస్థానానికి చేరుకోవడానికి సులభంగా ఉండే విధంగా ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు ముఖ్యమైన ప్రాంతాలలో Route Boards / Direction Boards ఏర్పాటు చేయడం గురించి చర్చించుట జరిగినది.బోర్డులు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలు, పరిమాణం, సూచించాల్సిన వివరాలు, తెలుగు/ఇంగ్లీష్ భాషల్లో సూచనలు మరియు ఏర్పాటు ఖర్చు తదితర అంశాలను పరిశీలించుట జరిగినది. ఈ మేరకు 15 రోజుల వ్యవధిలోగా అవసరమైన అంచనాలు సిద్ధం చేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. ముక్తీశ్వరం ఆలయాల ప్రాంతం నుండి వినాయక సదన్ వరకు రహదారి విస్తరణను పుష్కరాల నిధుల నుండి చేపట్టే అంశంపై చర్చించుట జరిగినది.
ఈ రహదారి విస్తరణ ద్వారా భక్తులకు కలిగే ప్రయోజనం, ముఖ్యంగా పండుగలు మరియు అధిక రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల రాకపోకలకు సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చర్చించుట జరిగినది. ఈ పనులకు సంబంధించి స్థానిక గౌరవ శాసనసభ్యులు మరియు స్థానిక గౌరవ పార్లమెంటు సభ్యుల ద్వారా సంబంధిత నిధులు మంజూరు చేయించుటకు కోరుతూ, అవసరమైన చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.