శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన సతీమణితో కలిసి మంగళవారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి జరగాలని, చిత్తూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కాణిపాకం ఆలయ ప్రాంగణంలో ఈ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్: లవకుమార్