గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం, మేజర్ న్యూస్, మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గణపురం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు గణపురం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించాలని కోరారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం, ప్రభుత్వ సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. కరువు మండలంగా ప్రకటించడంలో జాప్యం చేస్తే రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పోరాటం చేస్తామని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రిపోర్టర్; ఎల్లయ్య ,గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా