జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (నవంబర్ 3) : జిల్లాలోని యువతలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసి, వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత తెలిపారు. 30వ జాతీయ యువజన ఉత్సవాలు–2027ను పురస్కరించుకుని నవంబర్ 12న గురువారం ఉదయం 9 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఉత్సవాల్లో 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. జానపద నృత్యం, జానపద గీతాలు, పోస్టర్ తయారీ, చిత్రలేఖనం, వీధి నాటకం, కవితా రచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జానపద నృత్యం, జానపద గీతాల పోటీల్లో ఒక్కో బృందంలో గరిష్ఠంగా పది మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. వీధి నాటకంలోనూ పది మంది వరకు పాల్గొనవచ్చు. చిత్రలేఖనం, పోస్టర్ తయారీ పోటీల్లో ఏ3 పరిమాణంలో పోస్టర్ రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. కవితా రచన పోటీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహించనుండగా, 60 నిమిషాల్లో 500 పదాలకు మించకుండా కవిత రాయాల్సి ఉంటుంది.
పోటీల్లో ఒక్కో కళాకారుడు ఒక విభాగంలో మాత్రమే పాల్గొనాలని అధికారులు సూచించారు. న్యాయనిర్ణేతల నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాలకు ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు 2027 జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
పోటీల్లో పాల్గొనాలనుకునే యువతీ యువకులు తమ పేరు, వయస్సు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్, పాల్గొనే పోటీ విభాగం తదితర వివరాలతో నవంబర్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్వర్ణలత సూచించారు. దరఖాస్తులను ksteprr@gmail.com ఈమెయిల్‌కు పంపించాలని కోరారు. ఇతర వివరాలకు 9849909077 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించి ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందాలని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత పిలుపునిచ్చారు.