శ్రీ గాయత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు 'శ్రీ గాయత్రి' అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ అలంకార పూజా విశేషాలకు నెల్లూరుకు చెందిన రత్నయ్య, సుజాతమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.అనంతరం దేవస్థానంలో శాస్త్రోక్తంగా సంపుటీకరణ చండీ హోమం నిర్వహించారు. ఈ హోమానికి లక్ష్మి వెంకట సంజీవ రావు, హిమబిందు దంపతులు ఉభయకర్తలుగా పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ లలితా కుంకుమార్చన, మహాన్యాసమునకు నెల్లూరుకు చెందిన సూర్యనారాయణ రావు, విజయలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సాయంత్రం వేళ అమ్మవారికి నయనానందకరంగా నిర్వహించిన ప్రత్యేక పుష్పాలంకార కార్యక్రమానికి భరత్ కుమార్, ఇందిరాప్రియదర్శిని దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ ఉత్సవ కార్యక్రమాల నిర్వహణను ఆలయ కార్యనిర్వహణాధికారి,సహాయ కమిషనరు నూతలపాటి శ్రీధర్ నాయుడు, ముఖ్య ఉత్సవ అధికారి జనార్ధన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష పర్యవేక్షించారు. వారితో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు,అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.