గాంధీ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పటాన్ చెరు,; తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగ మహిళలందరినీ ఒకచోట చేర్చి సోదరభావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ జరుపుకునే ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చాటిచెబుతుందని అన్నారు.