ష్నైడర్ ఎలక్ట్రిక్లో 100 ఉద్యోగాల భర్తీ.. మహిళలకు 80 శాతం ప్రాధాన్యం: జిల్లా ఉపాధి అధికారి ఎం. రాధిక
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 100 ఫిక్స్డ్ టర్మ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం. రాధిక తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయాన్ని సంప్రదించాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.
డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశం
ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ), మెకాట్రానిక్స్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన 18 నుంచి 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు ఫిక్స్డ్ టర్మ్ అసోసియేట్గా పనిచేసే అవకాశం కల్పించనున్నారు.
వార్షిక ప్యాకేజీ రూ.3.12 లక్షలు
ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతన ప్యాకేజీ (సీటీసీ) రూ.3,12,330గా నిర్ణయించారు. ప్రొడక్షన్, క్వాలిటీ, మెయింటెనెన్స్, లాజిస్టిక్స్, వేర్హౌస్, మెథడ్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. హైదరాబాద్లోని గాగిల్లాపూర్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శామీర్పేట పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఉన్న సంస్థ తయారీ కేంద్రాల్లో అభ్యర్థులను నియమించనున్నారు.
పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్ష, వైద్య పరీక్షలతో పాటు శారీరక ఆరోగ్య అర్హత నిర్ధారణ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. క్యాంపస్ డ్రైవ్ లేదా వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదికను అధికారికంగా నిర్ధారించిన అనంతరం తెలియజేస్తారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలు, నమోదు విధానం, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో తెలుసుకోవాలి.
క్యాంటీన్, రవాణా, వైద్య సదుపాయాలు
ఎంపికైన ఉద్యోగులకు రాయితీ ధరలతో క్యాంటీన్, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. ఈఎస్ఐసీ ద్వారా వైద్య సదుపాయంతో పాటు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ (జీపీఏ) బీమా సౌకర్యం కూడా అందించనున్నారు.
మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యం
సంస్థ నియామక ప్రణాళిక ప్రకారం సుమారు 80 శాతం మహిళా అభ్యర్థులను నియమించాలనే లక్ష్యం ఉన్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం. రాధిక తెలిపారు. అర్హత కలిగిన మహిళా డిప్లొమా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె కోరారు.