గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రైతులకు బహుళ ప్రయోజనాలు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రైతులకు బహుళ ప్రయోజనాలు.
అక్టోబర్ 17లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి: ఉద్యాన అధికారి సంతోషి కుమారి.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ల భాగంగా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ పథకాల కింద రైతుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తోందన్నారు. అర్హులైన రైతులు ఈ నెల 17వ తేదీలోపు తమకు అవసరమైన పథకాలను ఎంపిక చేసుకుని సమీప రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్కే) పేర్లు నమోదు చేసుకోవాలని ఉద్యాన అధికారి సంతోషి కుమారి సూచించారు.
ఈ పథకాల ద్వారా కొత్త పండ్ల తోటల ఏర్పాటుతో పాటు పాత మామిడి తోటల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నారు. కొబ్బరి, ఖర్జూరం, ఆపిల్, మామిడి, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగుకు సంబంధించిన పథకాలను రైతులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా పంటల కోత అనంతరం ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం, నాణ్యతను కాపాడుకోవడం, మార్కెటింగ్కు అనుకూలమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం కోసం కలెక్షన్ సెంటర్లు, ప్యాక్హౌస్లు, కోల్డ్ రూములు, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించిన పథకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా పాలీహౌస్లు, పవర్ టిల్లర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, మినీ ట్రాక్టర్లు, టార్పాలిన్ పట్టలు, ఫారం పాండ్లు, ప్లాస్టిక్ క్రేట్లు వంటి పరికరాలు, సదుపాయాలకు సంబంధించిన పథకాలను కూడా రైతులు పరిశీలించవచ్చు. వీటి ద్వారా సాగు పనులను సులభతరం చేసుకోవడంతో పాటు పంటల నిర్వహణ, కోత అనంతర సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
పథకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి. గడువు సమీపిస్తున్నందున అర్హులైన రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా అక్టోబర్ 17వ తేదీలోపు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఉద్యాన అధికారి సంతోషి కుమారి కోరారు. ఉద్యాన పంటల సాగును విస్తరించడంతో పాటు రైతుల ఆదాయాభివృద్ధికి దోహదపడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.