కృష్ణా జిల్లాలో మూడు పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ..
మచిలీపట్నం, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం కృష్ణా జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలైన మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్లో భాగంగా తొలుత పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీలకు సంబంధించి అక్టోబర్ 16వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని వివరించారు. సంబంధిత మున్సిపాలిటీల్లో నియమితులైన ఎన్నికల అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 18వ తేదీ చివరి గడువు కాగా, అక్టోబర్ 19వ తేదీన నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 21వ తేదీ చివరి తేదీగా నిర్ణయించగా, అదే రోజు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రతి మున్సిపాలిటీలో వార్డుల వారీగా నియమించిన ఎన్నికల అధికారుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏ వార్డుకు ఏ అధికారి బాధ్యత వహిస్తున్నారు, నామినేషన్లను ఎక్కడ స్వీకరిస్తారు, సంబంధిత అధికారుల కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలను స్పష్టంగా పేర్కొంటూ ప్రత్యేక ప్రెస్ నోట్లు విడుదల చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు సంబంధిత ఎన్నికల నోటీసులో పేర్కొన్న తేదీ, సమయం, ప్రదేశంలోనే తమ నామినేషన్లను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోపు నామినేషన్లు దాఖలు చేయడం తప్పనిసరి అని, నోటీసులో పేర్కొన్న సమయం, ప్రదేశం విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్నికల నోటీసులను పరిశీలించి, తమ వార్డుకు సంబంధించిన ఎన్నికల అధికారి వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు, ఎన్నికలకు అవసరమైన సామగ్రి సమీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కే శ్రీధర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి జయరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.