స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100 శాతం విజయమే లక్ష్యం
విజయవాడ మేజర్ న్యూస్: ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు. గురువారం సాయంత్రం 63వ డివిజన్లోని అరండల్పేట ఉర్దూ హైస్కూల్ వద్ద నుంచి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 100 శాతం విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పేదల సంక్షేమం, యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో 63వ డివిజన్కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ప్రజల ఆదరణ, కార్యకర్తల కృషితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందని బొండా ఉమా విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపి, మాచర్ల పావని, సుబ్బారావు, ఇనుకుల సాయిబాబు, దొంగర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.