మూలా నక్షత్రానికి పటిష్ట ఏర్పాట్లు.. మూడు లక్షల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, దేవస్థానం అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మూలా నక్షత్రం ఏర్పాట్లపై గురువారం కొండ దిగువన ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్హౌస్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ ఈవో వీకే శీనా నాయక్ తదితరులు స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాదశర్మ సమక్షంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు 450 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామని, ఆధునిక నియంత్రణ కేంద్రం ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. హోల్డింగ్ కేంద్రాలతో పాటు క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వర్షం కురిసినా దర్శనానికి ఆటంకం కలగకుండా మహామండపం ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. కొండరాళ్ల పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమించామని, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల మధ్య ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేపట్టామన్నారు. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ప్రస్తుతం 3,500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండగా, మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని అదనంగా 900 మందికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి పట్టే సమయంతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని నియంత్రణ కేంద్రం ద్వారా గంటగంటకు తెలియజేస్తామని, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తెరల ద్వారా భక్తులకు సమాచారం అందిస్తామని చెప్పారు. సమాచార విశ్లేషణ ద్వారా దర్శన సమయాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ప్రవేశ పాసులను రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు పోలీసు, అధికారుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు. దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రతిరోజూ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోందని, మూలా నక్షత్రం రోజున 2.50 లక్షల నుంచి మూడు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకుంటున్నామని, సంకేత భాషా చిహ్నంతో కూడిన త్వరిత స్పందన విధానం ద్వారా అభిప్రాయాలను సేకరిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నామని వివరించారు. వైదిక కమిటీ సభ్యులతో చర్చించి భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలకు అనుగుణంగా క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.