కనకదుర్గమ్మ సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించి, మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతిగా తొలిసారిగా విజయవాడకు విచ్చేసిన ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సైతం అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. సుమారు ఎనిమిది నిమిషాల పాటు అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతికి దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీస్సులు అందించి ప్రసాదాలను సమర్పించారు. దేవస్థానం ఈవో వీ.కె. శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శేషవస్త్రాలను అందజేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.