telanagana
యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలపై మక్కువ చూపాలి...
సూర్య - పెద్దపల్లి రూరల్ : యువత చెడు మార్గాల్లో పయనించకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ యువత తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని రాఘవపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ యువతకు మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ అందించిన క్రికెట్ కిట్లు, టీషర్ట్లను ఎమ్మెల్యే క్రీడాకారులకు పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దసరా సెలవుల సమయంలో యువత సమయాన్ని వృథా చేయకుండా క్రీడల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో రాఘవపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రికెట్కు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని అన్నారు. వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు లభిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు.గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని విజయరమణారావు పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. జట్టుగా ఆడటం, పరస్పరం సహకరించుకోవడం, క్రమశిక్షణ పాటించడం వంటి లక్షణాలు క్రీడల ద్వారా అలవడతాయని వివరించారు.క్రీడల్లో రాణించాలనే ఆసక్తి ఉన్న యువతకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యువత మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని, గ్రామానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ గంట రమేష్, స్వామిరెడ్డి, గ్రామ యువకులు, క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.