సాంకేతికతపై పట్టు సాధించండి...ఉన్నత శిఖరాలను అధిరోహించండి
సూర్య, సెంటినరీ కాలనీ :విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించి...ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఎంతో కష్టపడి ఉన్నత చదువులకై పంపిస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుపైనే దృష్టి సారించాలని పెద్దపల్లి డిసిపి భూక్యా రాంరెడ్డి పిలుపునిచ్చారు. మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ బి.విష్ణువర్ధన్ అధ్యక్షతన నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిసిపి భూక్యా రాంరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిపి భూక్యా రాంరెడ్డి మాట్లాడుతూ తాము చిన్నప్పుడు కష్టపడి చదివి నేడు ఈ స్థానానికి చేరుకున్నామని, విద్యార్థులు సైతం ఉజ్వల భవిష్యత్తు కై నిరంతరం శ్రమించాలన్నారు. కొంత మంది విద్యార్థులు డ్రగ్స్ లాంటి వాటికి ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ లాంటివి అమ్మినా, సేవించిన తమ దృష్టికి తీసుకొని రావాలని, వీరి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే తపనతో సైబర్ నేరంలో చిక్కుకుంటున్నారన్నారు. ఓటిపి చెప్పవద్దని, ఎస్, నో లాంటివి చేయవద్దు అన్నారు. అరైవ్.. అలైవ్ క్రింద అతి వేగం, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకొక పోవడం సరైంది కాదన్నారు. రేయింబవళ్ళు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తు ఏర్పర్చుకోవాలని సూచించారు. అతిధులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. అనంతరం నిర్వహించిన సాంస్క తిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ ఆర్జీ-3 జిఎం సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్టు జిఎం కొలిపాక నాగేశ్వరరావు, జగిత్యాల, సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్ జి.నరసింహ, వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్, అధ్యాపక, నాన్ టీచింగ్ సిబ్బంది, ప్రథమ, ద్వితీయ విద్యార్థులు పాల్గొన్నారు.