కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం
కొయ్యలగూడెం: రూరల్ మేజర్ న్యూస్ :కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. పేద ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రే ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చికిత్స కోసం అత్యవసర పరిస్థితిలో తీసుకొచ్చిన పేషెంట్ కు సకాలంలో వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది, కనీస మానవత్వం లేకుండా ఏకంగా *20 నిమిషాల పాటు పేషెంట్ ను అలాగే నిలిపివేశారని* బాధితులు ఆరోపిస్తున్నారు.
పేషెంట్ నొప్పితో విలవిలలాడుతున్నా పట్టించుకోని వైద్య సిబ్బంది తీరుపై తోటి తీసుకొచ్చిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకు వైద్యం చేయరంటూ ప్రశ్నించడంతో వైద్య సిబ్బందికి, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆసుపత్రి ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చివరకు అక్కడ వైద్యం అందదని గ్రహించిన స్థానికులు తీవ్ర అసంతృప్తితో పేషెంట్ ను *108 అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.*
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య సేవలు అందిస్తుంటే, కొందరు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.