సీఎం చంద్రబాబు నాయకత్వంలో మారిటైమ్ హాబ్ గా ఏపీని తీర్చిదిద్దే దిశలో అడుగులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్గనిర్దేశకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మారిటైమ్ పాలసీ, పోర్టుల అభివృద్ధి విధానాలపై మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఆసక్తిని కనబరుస్తూ, ప్రశంసలు కురిపించింది.. మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే నేడు అమరావతి సచివాలయంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ కార్యాలయానికి విచ్చేసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో మారిటైమ్, పోర్టులు, షిప్‌బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధిపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, సీఈ రాఘవరావు తదితరులు మహారాష్ట్ర మంత్రి శ్రీ నితేష్ రాణేకు ఆత్మీయ స్వాగతం పలికారు. మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈఓ శ్రీ ప్రదీప్ పి., సీపీఓ కెప్టెన్ ప్రవీణ్ ఖారా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మనీష్ మెట్కర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (PPP) విధానం, అమలు చేస్తున్న నూతన మారిటైమ్ పాలసీ తదితర అంశాలపై ఏపీ అధికారులు మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోర్టుల అభివృద్ధి ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించడం, లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు.
ల్యాండ్ లార్డ్ మోడల్‌లో 3 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు.. మహారాష్ట్ర మంత్రి ప్రశంస
దేశంలో ప్రత్యేకమైన విధానంలో రాష్ట్రంలో మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ల్యాండ్ లార్డ్ మోడల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తున్న విధానాన్ని మహారాష్ట్ర మంత్రి శ్రీ నితేష్ రాణే ప్రశంసించారు. ప్రభుత్వం పోర్టు మౌలిక వసతులను అభివృద్ధి చేసి, అనంతరం ప్రైవేట్ సంస్థలకు ఆపరేషన్లను అప్పగించే విధానం ద్వారా పోర్టుల నిర్వహణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయా పోర్టుల్లో భవిష్యత్‌లో సుమారు 12–15 % వరకు ఆదాయం వచ్చే విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
రూ.4,500 కోట్ల పెట్టుబడితో ఒక్కో గ్రీన్ ఫీల్డ్ పోర్టు అభివృద్ధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పోర్టుల అభివృద్ధితో పాటు మత్స్యకారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న ఒక్కో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు దాదాపు రూ.4,500 కోట్ల పెట్టుబడి వ్యయంతో చేపట్టినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. పోర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. కోస్తా తీరం లేని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులకు ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులు కీలకంగా మారుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పోర్టుల చుట్టూ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.