సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
విశాఖపట్నం, మేజర్‌న్యూస్ :
విశాఖపట్నం వేదికగా గత రెండు రోజులుగా పండగ వాతావరణంలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయం సాధించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక గొప్ప శుభపరిణామమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో, దూరదృష్టితో చేస్తున్న ప్రయత్నాలు నేడు ఫలించాయని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి విజనరీ ఆలోచనలకు, మంత్రి నారా లోకేష్ గారి చురుకైన కార్యాచరణ తోడవడంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారని తెలిపారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరమన్నారు. సాధారణంగా పెట్టుబడిదారుల సదస్సులంటే కేవలం కంపెనీల రాక, వ్యాపార ఒప్పందాలకే పరిమితమవుతాయని, కానీ ఈ సదస్సు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 'పి4' విధానాన్ని ప్రోత్సహించడం చారిత్రాత్మకమని కలిశెట్టి కొనియాడారు. ఆర్థికంగా స్థిరపడిన వారితో పాటు పేదలను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ, వారికి అండగా నిలిచేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన ఆలోచన అని ఆయన ప్రశంసించారు. పేదల సేవలో నిరంతరం ఉంటామన్న మాటను నిలబెట్టుకుంటూ సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్ వే లాంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారు, నేడు అదే ఉత్తరాంధ్రలోని విశాఖలో ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహించి ప్రాంతీయ అభివృద్ధికి మరింత బలం చేకూర్చారని ఎంపీ పేర్కొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆంధ్రుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
భాగస్వామ్య సదస్సు వేదికగా పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 'పి4' (P4) కార్యక్రమాన్ని ఒక పేదల కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్దడం చారిత్రాత్మకమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను పేదల సంక్షేమానికి అనుసంధానం చేయాలన్న సీఎం ఆలోచన ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని ఎంపీ అన్నారు. P4 కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత పేదల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరిగాయని, ఈ సదస్సుతో కూటమి ప్రభుత్వంపై వారికి మరింత నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేదలను పేదవారిగా ఉంచకుండా, వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా ఎదిగేలా సీఎం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 1,220 మంది ట్రిపుల్ ఐటీ (IIIT) విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు హీరో మోటార్స్ కార్పొరేషన్ సంస్థ స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప అవకాశమన్నారు. రాష్ట్రంలోని 100 గ్రామాల్లో 25,000 'బంగారు కుటుంబాలను' దత్తత తీసుకుని, వారి జీవన ప్రమాణాలు, ఉపాధి మెరుగుపరిచేందుకు ఐటీసీ లిమిటెడ్ ముందుకు రావడం అభినందనీయమని, ఇందుకు చొరవ చూపిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
5 దేశాల్లో 11 రోడ్ షోల నిర్వహణ, సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారి విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలతో జరిపిన నిరంతర చర్చల ఫలితంగా సదస్సులో రూ. 86,522 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 194 ఒప్పందాలు కుదరడం ఒక సరికొత్త రికార్డు..31వ సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని కలిశెట్టి పేర్కొన్నారు. గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, నేడు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారంటే అందుకు కారణం చంద్రబాబు గారి విజనరీ, అనుభవంపై ఉన్న నమ్మకమేనని స్పష్టం చేశారు. ఇవి కేవలం కాగితాలకే పరిమితమయ్యే ఒప్పందాలు కావని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే వాస్తవ పెట్టుబడులని అన్నారు. గత రెండున్నరేళ్ల ఎన్డీఏ కూటమి పాలనకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఎంపీ అన్నారు. కార్పొరేషన్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం ప్రజల విశ్వాసానికి అద్దం పడుతోందన్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంత ఓటర్లు స్వచ్ఛందంగా స్పందిస్తూ.. "మీరు ప్రచారానికి రానవసరం లేదు, చంద్రబాబు గారి కష్టం, నిజాయితీ మాకు తెలుసు, మేము బాగుపడ్డాం, మీ అభ్యర్థులనే గెలిపిస్తాం" అని చెప్పడం ఒక తెలుగుదేశం ప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుడిగా తనకు ఎంతో గర్వకారణంగా అనిపించిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పునే స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేసి మమ్మల్ని గౌరవించిన రాష్ట్ర ప్రజానీకానికి ఎంపీ కలిశెట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు, దౌర్జన్యాలు, అక్రమాలకు తావులేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో జరిగినట్లు కాకుండా ఈసారి ఎన్నికలు ఎంతో పారదర్శకంగా జరిగాయని ఎంపీ తెలిపారు. రాయలసీమ సహా పలు ప్రాంతాల్లో రౌడీ మూకలను ప్రోత్సహించి అల్లర్లు సృష్టించాలని, తద్వారా ఎన్నికలను అడ్డుకుని కోర్టుల ద్వారా వాయిదా వేయించాలని జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు పన్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్ తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఆ కుట్రలన్నీ భగ్నమై, ఎన్నికలు సజావుగా జరిగాయని కొనియాడారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అట్టడుగుకు నెట్టిన జగన్మోహన్ రెడ్డి, నేడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని కలిశెట్టి విమర్శించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలందరూ ఎన్డీఏ కూటమికి అండగా నిలబడ్డారని, రేపు జరగబోయే ఎన్నికల్లోనూ ఇదే తీర్పు పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉండేదని, కానీ నేడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం సామాన్యులకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి పరిపాలనలో భాగస్వాములను చేస్తున్నారని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు కూడా పునరాలోచన చేయాలని హితవు పలికారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానన్న కనీస బాధ్యత లేకుండా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం లేదా ప్రారంభోత్సవం జరుగుతుంటే, రెండు రోజుల ముందే అక్కడికి వెళ్లి ఈవెంట్ల పేరుతో అల్లజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చే కొన్ని గంటల ముందు కూడా ఉత్తరాంధ్రలో పర్యటన పెట్టి అలజడి సృష్టించాలని చూశారని, ఈ విషయం ప్రధాని దృష్టికి కూడా వెళ్లిందని పేర్కొన్నారు. సంక్షేమం, పేదల అభ్యున్నతి అంటే జగన్మోహన్ రెడ్డికి గిట్టదని వ్యాఖ్యానించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయం.. లోకేష్ పరిణతి చెందిన నాయకత్వం రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉండాలని బలంగా సంకల్పించుకున్నారని ఎంపీ అన్నారు. భవిష్యత్తులో వార్డ్ మెంబర్ నుంచి సహకార, సార్వత్రిక ఎన్నికల వరకు ఏ ఎన్నిక జరిగినా పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా కూటమిదే విజయమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అండదండలతో రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సదస్సులో లోకేష్ గారు మాట్లాడిన తీరు, ఆయన పరిణతి చెందిన నాయకత్వాన్ని చూసి ప్రజలతో పాటు మేధావులు సైతం ప్రశంసిస్తున్నారని చెప్పారు. తాను ఒక ఎంపీగానో, టీడీపీ ప్రతినిధిగానో కాకుండా, ఒక సగటు ఆంధ్రుడిగా ప్రజల మనోభావాలను తెలియజేస్తున్నానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు.
2024లో రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పునకు, నమ్మకానికి అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా పనిచేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రలను రాష్ట్రంలోని ప్రతి ఓటరు తిప్పికొట్టారని ఎంపీ అన్నారు. రెండో విడత ఎన్నికలతో పాటు రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ, ఎన్డీఏ కూటమి మద్దతుదారులే సంపూర్ణ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కష్టానికి అండగా ఉంటూ, ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో, బాధ్యతతో ముందుకు సాగుతామని తెలిపారు. ఢిల్లీలో తాము ప్రత్యక్షంగా చూస్తున్న అనుభవాలను ఎంపీ వివరిస్తూ.. "అంత సీనియర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫైళ్లు పట్టుకుని కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతుంటే మాకే ఒక రకంగా బాధ కలుగుతుంది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే బాధ్యతతో అర్ధరాత్రి 12 గంటలైనా, 2 గంటలైనా సరే అనుకున్న పనులు పూర్తయ్యే వరకు ఆయన విశ్రాంతి తీసుకోవడం లేదు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం" అని కొనియాడారు. పొరుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబు గారి విజనరీని, రాష్ట్ర అభివృద్ధిని ప్రశంసిస్తుంటే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టపు చూపుగా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కలిశెట్టి విమర్శించారు. గత రెండేళ్లలో ఆయన చేసిన వ్యవహారాలను ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ప్రత్యక్షంగా చూశారని, అందుకే వైసీపీ మాటలను ఎవరూ నమ్మడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తోందని ఎంపీ ప్రశంసించారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులను క్షణాల్లో మంజూరు చేస్తూ అధికారులు అద్భుతమైన టీమ్ వర్క్ కనబరుస్తున్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, అధికార యంత్రాంగం మరియు లబ్ధిదారులలో ఆత్మవిశ్వాసం, సంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రులు సైతం రాష్ట్ర పరిపాలనను, సీఎం పనితీరును అభినందించడం కేంద్ర ప్రభుత్వ ఆనందానికి నిదర్శనమన్నారు. విశాఖలో సీఐఐ (CII) సదస్సును ఇంత ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ బృందానికి ఒక ఉత్తరాంధ్ర వాసిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు