నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
విజయవాడ, మేజర్‌న్యూస్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల అనుసారం, రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, నిల్వలు మరియు లభ్యతపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. రాష్ట్ర ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా మార్కెట్లో పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 26 నుండి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 బృందాలు 250 మార్కెట్లు మరియు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాయి.ఇందులో భాగంగా దాదాపు 715 హోల్‌సేల్ వ్యాపార సంస్థలు, 17 రైస్ మిల్లులు, 13 గోదాములు మరియు 145 రిటైల్ దుకాణాలను పరిశీలించి మొత్తం 516 కేసులు నమోదు చేశారు. ధరల అసాధారణ పెరుగుదల, కృత్రిమ కొరత మరియు అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 5 ప్రత్యేక సందర్భాలను గుర్తించారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు రూ. 10.43 కోట్ల విలువైన నిత్యావసర సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దాదాపు 160 టన్నుల బియ్యం, 2,018 మెట్రిక్ టన్నుల ధాన్యం, 830 కిలోల పప్పులు, 1,930 లీటర్ల వంట నూనె, 9.3 మెట్రిక్ టన్నుల పసుపు మరియు అక్రమ రవాణాకు సంబంధించిన 1,050 కిలోల సరుకులు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే సివిల్ సప్లైస్, జీఎస్టీ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సహకారం తీసుకుని సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై పీడీ యాక్ట్ (PD Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.