సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: కిమిడి
చీపురుపల్లి మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గరివిడి మండల టీడీపీ నాయకులతో ఆయన సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. రానున్న సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేస్తూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గరివిడి మండల టీడీపీ నాయకులు పైల బలరాం, సారేపాక సురేష్, రాజు పాల్గొన్నారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా