మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.3 వేల జరిమానా,ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్
సూర్య మంచిర్యాల: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి.హన్నన్ హెచ్చరించారు.మంచిర్యాలలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ అనలైజర్ పరీక్షలో 347 రీడింగ్ నమోదైన కుమ్మరి సురేష్‌ను ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసును విచారించిన మంచిర్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్ నిందితుడికి రూ.3 వేల జరిమానా విధించడంతో పాటు, ఒకరోజు పాటు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.అదేవిధంగా అదే రోజు మరో 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను విచారించిన న్యాయమూర్తి మొత్తం రూ.17 వేల జరిమానా విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు.ఒక్కరి నిర్లక్ష్యం అనేక కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను పర్యవేక్షిస్తూ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ,బాధ్యతాయుత ప్రవర్తన అలవాటు చేయాలని కోరారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రజలందరూ సహకరించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.