telangana
10+2 విధానానికి స్వాగతం - డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు
సూర్య నస్పూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 10+2 విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు. అయితే ఈ విధానం అమలులో భాగంగా ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. పదో తరగతి వరకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు 11, 12 తరగతులు నిర్వహించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.పదో తరగతి అనంతరం అనేక మంది విద్యార్థులు సామాజిక, ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచనఅభినందనీయమన్నారు. ఈ విధానం సమర్థవంతంగా అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
- బడ్జెట్ పాఠశాలల మనుగడకు భరోసా కల్పించాలి
ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతుల నిర్వహణకు అనుమతులు కల్పిస్తే తక్కువ ఫీజులతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్య అందిస్తున్న చిన్న, మధ్యతరహా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉపాధికీ ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు విద్యా ప్రమాణాలు, భద్రతా నిబంధనలకు అనుగుణంగా అదనపు ఆర్థిక భారం లేకుండా 11, 12 తరగతులు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 2027–28 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిని అదే పాఠశాలలో కొనసాగించవచ్చా? లేక ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేరాలా? అనే అంశంపై తల్లిదండ్రుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించాలని సూచించారు. 10+2 విధానం అమలు, పాఠశాలల అప్‌గ్రేడేషన్, అఫిలియేషన్, ప్రవేశాలు, పాఠ్యప్రణాళిక, పరీక్షల విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితం కాకుండా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ విధానంపై నిర్ణయాలు తీసుకునే ముందు ట్రస్మా వంటి పాఠశాలల యాజమాన్య సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడంతో పాటు ఉన్నత విద్యకు అవసరమైన మార్గాలను సులభతరం చేయాలని సూచించారు.
10+2 విద్యా విధానాన్ని తాము వ్యతిరేకించడం లేదని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు స్పష్టం చేశారు. పాఠశాలలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి ప్రోత్సహించాలే తప్ప, ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతుల అనుమతులు ఇచ్చి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల మనుగడను దెబ్బతీయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.