నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలి : ఏడిఏ మోహనరావు
గుంటూరు: గుంటూరు రూరల్ మండలంలోని చిన్నపలకలూరు, లింగాయపాలెం గ్రామాల్లో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహనరావు, మండల వ్యవసాయ అధికారి బుల్లా కిషోర్ పాల్గొని రైతులకు ఆధునిక సాగు మెళకువలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు అధికారులు మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్ వినియోగంపై రైతులకు వివరించారు. రైతులు తమ రైతు గుర్తింపు సంఖ్య లేదా ఆధార్‌కు అనుసంధానమైన చరవాణి సంఖ్యకు వచ్చే ఓటీపీ ద్వారా సులభంగా ఎరువులు కొనుగోలు చేయవచ్చన్నారు. శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు పంటల వారీగా ఎరువుల కేటాయింపు జరుగుతుందని, దీనివల్ల అర్హులైన ప్రతి రైతుకు ఎరువులు సక్రమంగా అందుతాయని స్పష్టం చేశారు.'ఖేత్ బచావో అభియాన్'లో భాగంగా భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని అధికారులు సూచించారు. కలుపు నివారణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో పాటు పంటలకు వచ్చే తెగుళ్లు, రోగాలను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ, జీవ ఎరువులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రబీ-2026 సీజన్లో శనగ, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసే రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉన్నందున, సమీపంలోని సామాన్య సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత గడువులోపు బీమా చేయించుకుని పంటలకు రక్షణ పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఆనంద్ బాబు, గ్రామ ఆదర్శ రైతులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య నాయక్