సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య...
సారవకోట నవంబర్ 29 మేజర్ న్యూస్: మండలంలోని బద్రి, అవలంగి గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పంగ భాస్కరరావు, బోర సురేష్ కుమార్‌లకు మద్దతుగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.
ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామస్తులతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సర్పంచ్ అభ్యర్థులకు సూచించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.