సైకిల్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మిక క్షేత్రస్థాయి పర్యటన.
పాలకొల్లు సూర్య న్యూస్ పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తెల్లవారుజామున సైకిల్‌పై ఆకస్మిక క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. తన నివాసం నుంచి సైకిల్‌పై మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి, పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం సైకిల్‌పై టిడ్కో గృహాల కాలనీకి చేరుకున్న మంత్రి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, మంచినీటి సరఫరాను, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. కాలనీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లు ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించేందుకు పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పట్టణాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న చెత్త పారవేత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 12వ వార్డు సూర్యతేజ నగర్‌లోని చెత్త నిల్వ కేంద్రంలో కొండల్లా పేరుకుపోయిన 76 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు పేర్కొన్నారు. ఎడ్లబజారు ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు మరో రెండు మూడు నెలల్లో పూర్తవుతాయని తెలిపారు.భవిష్యత్తులో పట్టణంలోని ఏ ప్రాంతంలోనూ చెత్త పేరుకుపోకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. పారిశుధ్య నిర్వహణలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం అధికారుల, పారిశుధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. చెత్తను రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయాలని సూచించారు. ప్రజలు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమష్టిగా కృషి చేసినప్పుడే పరిశుభ్రమైన పాలకొల్లును సాధించగలమని ఆయన పేర్కొన్నారు.
రిపోర్టర్ నరసింహారావు పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా