రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు!
సముద్ర స్నానానికి వెళ్లి కనిపించకుండా పోయిన బుల్లయ్య కళాశాల విద్యార్థి
కోస్ట్‌గార్డ్, నేవీకి సమాచారం.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
సాగర్‌నగర్, (మేజర్ న్యూస్):
సరదాగా స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ కళాశాల విద్యార్థి అలల మధ్య గల్లంతైన ఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో చోటుచేసుకుంది. జీవీఎంసీ 11వ వార్డు పరిధిలోని రుషికొండ బీచ్‌కు శనివారం ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లగా, వారిలో బుల్లయ్య కళాశాలకు చెందిన సయ్యద్ జాహిద్ రాజా (19) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ కోటవీధికి చెందిన జాహిద్ రాజా తన స్నేహితులతో కలిసి నవంబర్ 21న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బీచ్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సముద్ర స్నానానికి దిగిన అతడు కనిపించకుండా పోయాడు. అయితే అతనితో పాటు వచ్చిన మిగిలిన ఏడుగురు విద్యార్థులకు జాహిద్ రాజా ఎప్పుడు గల్లంతయ్యాడనే విషయం తెలియకపోవడం గమనార్హం. ఘటనపై సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆచూకీ కోసం ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఇండియన్ నేవీ అధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు మెరైన్ పోలీసులు సముద్ర తీర ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం కూడా విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.