రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు..
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని రెండవ వార్డు, ఎల్లమ్మ వీధి నాలుగో సచివాలయ పరిధిలో ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి స్లాబ్ రోడ్డు వైపు పొడిగించి, డ్రైనేజీ కాలువను దాటి రహదారిపైకి వచ్చేలా నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భాగాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.ఇంటి నిర్మాణం చేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే రోడ్డు కాలువ స్థలాన్ని ఆక్రమించేలా స్లాబ్ వేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణం జరుగుతున్న సమయంలో సంబంధిత సచివాలయ సెక్రటరీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు. నిర్మాణం ప్రారంభ దశలోనే పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే యజమానికి నోటీసులు జారీ చేసి పనులు నిలిపివేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో రోడ్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, అలాంటప్పుడు రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైనే నిర్మాణాలు జరిగితే భవిష్యత్తులో రహదారులు ఎక్కడ మిగులుతాయని ప్రశ్నిస్తున్నారు.స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించి సంబంధిత సచివాలయ సెక్రటరీని అక్కడికి పంపించి, సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో స్థానికులు అక్కడి నుంచి వెనుదిరిగారు.మరి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాన్ని తొలగిస్తారా? లేక నోటీసులతో సరిపెడతారా? అనేది వేచి చూడాలి.