రిమ్స్ లో రక్తదానం చేసిన ముస్లిం సోదరులు
శ్రీకాకుళం,
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా పయామ్ ఇ ఇన్సానియత్ ఫోరమ్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమాజంలో రక్తదాతల సంఖ్య మరింత పెరగాలని, రక్తదానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పయామ్ ఇ ఇన్సానియత్ ఫోరమ్ హైదరాబాద్ ప్రతినిధి జనాబ్ ముస్లిముద్దీన్, ఉత్తరాంధ్ర కన్వీనర్ జనాబ్ అబ్దుల్ కలామ్, శ్రీకాకుళం ప్రతినిధి జనాబ్ షేక్ సయీమ్, వైద్యాధికారులు డాక్టర్ ఎం. షామిల, డాక్టర్ ఎల్.పద్మప్రియ, డాక్టర్ పి. ప్రకాష్‌రావు తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. ప్రపంచ రక్తదాతలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆసుపత్రి సిబ్బంది, పలువురు రక్తదాతలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.