రెండో విడత ఎన్నికల్లో 61 పంచాయతీలు ఏకగ్రీవం...
విజయనగరం మేజర్ న్యూస్:రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివిధ మండలాల్లో కలిపి జిల్లాలో మొత్తం 61 గ్రామ పంచాయతీల పూర్తి పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవమైన పంచాయతీల తుది వివరాలను వెల్లడించారు. మండలాల వారీగా పరిశీలిస్తే మెంటాడ మండలంలో అత్యధికంగా 11 పంచాయతీల పూర్తి పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా, గజపతినగరం, గంట్యాడ మండలాల్లో 9 చొప్పున పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే దత్తిరాజేరు మండలంలో 8, వంగరలో 7, రేగిడి ఆమదాలవలసలో 6, సంతకవిటిలో 6, బొండపల్లిలో 4, రాజాం మండలంలో 1 పంచాయతీ చొప్పున పూర్తి పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే మరో మూడు పంచాయతీల్లో కూడా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనప్పటికీ, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏకగ్రీవ స్థానాలు పోను మిగిలిన పంచాయతీలకు ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.