డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి
విజయనగరం మేజర్ న్యూస్:
విజయనగరం,నవంబర్ 25 : రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయనగరం కోట జంక్షన్ వద్ద డీఎస్సీ అభ్యర్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని,జిల్లాల వారీగా ఖాళీలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలని, సింగిల్ పేపర్ విధానం అమలు చేయాలని, పరీక్షల్లో నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల వయోపరిమితి కోల్పోయిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా గరిష్ఠ వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పెషల్ ఎడ్యుకేషన్ 2,260 పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్, డిగ్రీ అర్హత శాతాల్లో గతంలో ఉన్న నిబంధనలను కొనసాగిస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
డీఎస్సీ లక్షలాది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, సంవత్సరాల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం డీఎస్సీ అభ్యర్థులు
జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.