రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఉపసంహరణపై ఉద్యమం చేస్తాం : ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా
కనిగిరి, మేజర్‌న్యూస్ :
కనిగిరి మున్సిపల్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా తీవ్రంగా ఖండించారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ బాజీ నామినేషన్ ఉపసంహరణ చేశారని అధికారులు తెలపడం చట్ట వ్యతిరేకమని ఆయన అన్నారు. షేక్ బాజీ అనే మైనార్టీ మహిళ తాను వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని అది కేవలం అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు కలిసి చేస్తున్న దుష్ప్రచారమని ఆయన తీవ్రంగా ఖండించారు.ఉపసంహరణపై మేము అధికారులను సంప్రదించగా బుర్ఖా ధరించిన మహిళ వచ్చి ఉపసంహరణ చేసినట్లు అధికారులు తెలపడం అస్యాస్పదమని అన్నారు. ఎన్నికల పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారుల స్టేట్మెంట్లను వివిధ పత్రికల్లో వచ్చిన ప్రకటనలు స్పష్టంగా మా పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు తెలిపాయన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా కుటుంబంతో కలిసి బంధువుల ఇళ్లలో ఉన్నామని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గా నామినేషన్ వేసిన షేక్ బాజీ మీడియా ముందు వాపోయారు.నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం పై, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌కు విజయ సునీతకు ఫిర్యాదు చేసినట్లు సైదా తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపసంహరణపై కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాత్ర పై సైదా తీవ్రంగా మండిపడ్డారు. కనిగిరిలో ముస్లిం మైనారిటీ మహిళకు అన్యాయం జరిగితే కనీసం నోరు మెదపలేదని మండిపడ్డారు. కానీ ఒక మైనార్టీ మహిళ స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యంబద్ధంగా చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం తప్పా అని ఆయన ఎమ్మెల్యే ఉగ్రను ప్రశ్నించారు.నామినేషన్ ఉపసంహరణ వ్యవహారంపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని, అంతేకాకుండా జరగనున్న ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ప్రజల్లోకి వెళ్లి మైనార్టీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై కనిగిరి నియోజకవర్గం ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. తన నామినేషన్ ఉపసంహరణపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ అభ్యర్థి షేక్ బాజీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిల్లి వెంకటేశ్వర రెడ్డి, అబ్దుల్ కలాం, కొండగుంట సుబ్బారావు, కందుల మార్తమ్మ, సయ్యద్ ఇమ్రాన్, షేక్ ముబారక్, ఖాసింసా తదితరులు పాల్గొన్నారు.