పోలీసులపై అనవసరంగా అసభ్యపదజాలంతో రెచ్చిపోతున్న వైసీపీ మూకలపై ఎస్ఈసీ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ వర్ల రామయ్య
అమరావతి, మేజర్‌న్యూస్ :
2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించి, కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినా ఆ పార్టీ నేతల తీరులో, ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రజలు ఇంత ఘోరంగా తిరస్కరించిన తర్వాతైనా చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నేతలు ఇంకా అహంకారంతో, నిర్లజ్జగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ఇకపై గెలిచే అవకాశమే లేదు. గత ఎన్నికల్లో ప్రజలు వారి పాలనను ఛీత్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. సాధారణంగా ఇంతటి పరాభవం ఎదురైతే ఎవరైనా సిగ్గుతో తలదించుకుని ఆత్మపరిశీలన చేసుకుంటారు. కానీ వైసీపీ నేతల అరాచకం, దుర్మార్గపు భాష, వేధింపుల ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మీకు సమస్యలు ఉంటే ప్రతిపక్షంగా అధికారంలో ఉన్న మాతో రాజకీయంగా మాట్లాడాలి. కానీ యూనిఫామ్ వేసుకుని విధులు నిర్వహించే పోలీసుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం దుర్మార్గం.
వైసీపీ నేతల భాష అత్యంత హేయం
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వారు పోలీసుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పోలీసుల బట్టలు విప్పిస్తామని బెదిరించడం సభ్యసమాజం తలదించుకునే చర్య. అసలు ఆయన సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చారా? లేక గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చారా? ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి వాడే భాషేనా ఇది? ప్రజలు ఐదేళ్లపాటు ఇలాంటి వారిని ఎలా భరించారో అర్థం కావడం లేదు. ఇతరుల బట్టలు విప్పించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనా? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో పోలీసులు పూర్తిగా నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో లాగా ఇక్కడ కక్షసాధింపులు ఉండవు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అవసరమైతే మా పార్టీ వాళ్లయినా, ప్రెస్ సోదరులైనా నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎవరికీ మినహాయింపు లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, వైసీపీ నాయకులు తమ సంస్కారహీనమైన నోటిని అదుపులో పెట్టుకోవాలని వర్ల రామయ్య హెచ్చరించారు.
డిజిటల్ డైరీల పేరుతో పోలీసులను బెదిరిస్తే ప్రజలు ఓట్లేయరు.. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటికలే
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, పోలీసులు నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తిస్తుంటే ఓర్వలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల్లో గందరగోళం సృష్టిస్తే సొంత పార్టీ వాళ్లయినా సరే కేసులు పెట్టిన ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదని, చట్టం అందరికీ సమానంగా అమలవుతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంటే… వైసీపీ నాయకులు మాత్రం విధుల్లో ఉన్న పోలీసుల బట్టలు విప్పుతామని మాట్లాడటం సిగ్గుచేటు. బట్టలు లేకుండా తిరగడం వాళ్ల పార్టీలోని కొందరు ఎంపీలకు అలవాటు కావచ్చేమో కానీ, బాధ్యతాయుతమైన పోలీసు అధికారుల పట్ల ఇలాంటి అసభ్యకర మాటలు మాట్లాడితే సహించేది లేదు. నోరుంది కదా అని సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడితే సమాజం హర్షించదు. పోలీసులు నిబంధనల ప్రకారం పనిచేస్తుంటే, వారి పేర్లను డిజిటల్ పుస్తకాల్లో రాసుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి బెదిరించడం హాస్యాస్పదం. పేర్లు రాసుకుని ఏం చేస్తారు? అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తాననడం పగటి కల తప్ప మరొకటి కాదు. అసలు నిన్ను మళ్లీ రమ్మని ఆహ్వానించేందుకు రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సిద్ధంగా ఉన్నారా? అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ప్రజలు మిమ్మల్ని మళ్లీ ఆహ్వానిస్తారా? పోలీసులను తిట్టి, వ్యవస్థలను బెదిరిస్తే ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకుల నడవడికను, సంస్కారాన్ని, మంచి పనితీరును చూసి గౌరవిస్తారు తప్ప… ఇలాంటి రౌడీయిజాన్ని, బూతు మాటలను చూసి కాదు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నిన్నటిదాకా నమ్ముకున్న నాయకులే తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. కనీసం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలన్నా జగన్ పేరును గానీ, పార్టీ గుర్తును గానీ వాడుకోవడానికి భయపడే దుస్థితి వచ్చింది. సొంత పార్టీ వారే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేనప్పుడు, ఇంకా పోలీసుల సంగతి చూస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరం. ప్రజలు అధికారం నుంచి తరిమికొట్టినా వైసీపీ నేతల్లో అహంకారం తగ్గలేదని, పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా బెదిరింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. పోలీసులను అవమానిస్తే సహించేది లేదు
రాష్ట్రంలో చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వ్యవస్థపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బరితెగించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఛీత్కరించి అధికారం నుంచి గెంటేసినా వైసీపీ నేతల నోటి దురద, అహంకారం తగ్గలేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా పోలీసులనుద్దేశించి “లంగా పోలీసులు” అంటూ వాడిన భాష అత్యంత హేయమైనది. ఒక మహిళ అయి ఉండి, తోటి సమాజం వింటోందన్న స్పృహ లేకుండా ఇలాంటి సంస్కారహీనమైన బూతులు మాట్లాడటం ఆమె విచక్షణకే వదిలేస్తున్నాం. మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలి. కనీస ఆలోచన, సంస్కారం లేకుండా పోలీసు వ్యవస్థను కించపరిస్తే రాష్ట్ర మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు. అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తానని జగన్మోహన్ రెడ్డి బెదిరించడం విడ్డూరంగా ఉంది. యూనిఫాం వేసుకున్న ఒక పోలీసు అధికారి దాదాపు 35 ఏళ్లపాటు సర్వీసులో ఉండి ప్రజాసేవ చేస్తారు. వారి సర్వీసు కాలంలో మీలాంటి ఎందరో రాజకీయ నాయకులను చూసి ఉంటారు. తమ విధిని తాము చేస్తుంటే వారిని అవమానించి, వారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన కలిగించడం దుర్మార్గం. ఖద్దరు చొక్కాలు వేసుకోవడానికి వారేమీ రాజకీయ నాయకులు కాదు, రాజ్యాంగ రక్షకులు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదు. పొద్దున్నే లేచి నోటికొచ్చినట్లు మాట్లాడటం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అలవాటుగా మారింది. అసలు పోలీసులతో మీకున్న సమస్య ఏమిటి? వారు మీకు ఏం ద్రోహం చేశారు? చట్టప్రకారం పనిచేస్తున్న అధికారులను దూషిస్తే మీకేం వస్తుంది? ప్రజలు ఎన్నికల్లో మిమ్మల్ని తరిమికొట్టిన బాధను పోలీసులపై చూపిస్తే ప్రజలు హర్షించరు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో, చట్టబద్ధ నిబంధనలకు లోబడి పని చేస్తున్నారు. ఏ అధికారి పైనైనా అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం ఎన్నికల కమిషన్‌కు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఫిర్యాదు చేయాలి తప్ప మైకుల ముందుకొచ్చి బూతులు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఒక్క పోలీసు అధికారిని కించపరిచినా వేలాది మంది పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ సంస్కారహీనమైన భాషను మానుకోవాలని, విధుల్లో ఉన్న పోలీసుల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వర్ల రామయ్య స్పష్టం చేశారు.