రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్, కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా మాట్లాడుతూ రాజ్యాంగమే మనకు రక్ష, సమానత్వమే మన లక్ష్యమని చెప్పారు. ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి జాతికి ఒక గుర్తింపు ఉంటుంది. కానీ భారతదేశానికి మాత్రం ఒక గ్రంథమే గుర్తింపు. అదే మన రాజ్యాంగం. కులం, మతం, భాష, ప్రాంతం, ధనిక, పేద అనే తేడా లేకుండా 140 కోట్ల మందిని ఒకే తాడుతో కట్టిన మహాగ్రంథం మన రాజ్యాంగం. అందుకే నవంబర్ 26 అంటే కేవలం ఒక తేదీ కాదు. భారతదేశం తన భవిష్యత్తును తానే రాసుకున్న రోజు. 1949లో నేటి దినం రాజ్యాంగం ఆమోదం పొందింది. 1950 జనవరి 26 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చిందన్నారు. “రాజ్యాంగం మనకు కేవలం హక్కులను మాత్రమే కాదు, బాధ్యతలను కూడా నేర్పింది. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. యువత రాజ్యాంగాన్ని చదివి, అర్థం చేసుకుని ముందుకు సాగాలి. వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి” అని చెప్పారు. ఆమోదం పొందిన రోజు గుర్తింపుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకుంటూ వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది.
దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి చిట్టిబాబు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవగాహన పెంచుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ ప్రగతిలో భాగస్వాములు అవ్వడమే ఈరోజు మనం రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు కొల్లా, పోతపోల రామ్మూర్తి, కొత్తపల్లి చిట్టిబాబు, పాండియన్ నాయకర్, నీరజాక్షులు, వేణుగోపాల్, సూరి, రాసం ఉదయ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్