భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని మంత్రి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో విశేష కృషి చేసిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సేవలను స్మరించుకున్నారు. కుల, మత, వర్గ, లింగ వివక్షకు తావులేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన మహోన్నత గ్రంథం భారత రాజ్యాంగమని అన్నారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవించడంతో పాటు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.